బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌(78) మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన బ్లాగులో వివరిస్తూ.. కొద్ది రోజులు బ్లాగ్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. బిగ్‌బీకి సర్జరీ అనేసరికి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే అమితాబ్ తాను ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటున్నారో తెలియచేయలేదు. అంతేకాదు ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్దితిని వివరించలేదు. దాంతో అమితాబ్‌కు ఏమైంది.. అసలు ఆపరేషన్ ఎందుకు? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటూ చర్చ మొదలైంది. మరో ప్రక్క బిగ్‌బీ చేయించుకోబోయే శస్త్ర చికిత్స సక్సెస్ కావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు...ట్వీట్లు చేస్తున్నారు. 

అమితాబ్ బచ్చ‌న్ గతంలో అంటే 1982లో 'కూలీ' సినిమా షూటింగులో స్టంట్స్ చేస్తుండగా కడుపులో బలమైన గాయం అయింది. దీంతో స‌ర్జ‌రీ చేయ‌డంతో నెల‌ల త‌ర‌బ‌డి ఆసుప‌త్రిలోనే ఉన్నారు. 2005లో మ‌రోసారి ఆయ‌న‌కు స‌ర్జ‌రీ జ‌రిగింది . క‌డుపు నొప్పి తీవ్రంగా రావ‌డంతో ఆప‌రేష‌న్ తప్పని సరి అయింది. అయితే త‌ను ఆపరేషన్ కుఆయన వెళ్లే ముందు ఈ విష‌యాన్ని త‌న బ్లాగులో ప్ర‌స్తావిస్తుంటారు.  2005లో స‌ర్జ‌రీ చేయించుకున్న‌ప్పుడు ఇది మైన‌ర్ స‌ర్జ‌రీ మాత్ర‌మే క్లిష్ట‌మైన‌ది కాద‌ని చెప్పి అభిమానులకు ధైర్యం చెప్పారు. ఇక అబితాబ్‌ తాజాగా నటించిన చిత్రాలలో ‘ఝుండ్’  జూన్ 18న విడుదల కానుంది. 

  ‘ఝుండ్‌’ లో అమితాబ్ ఫుట్‌బాల్‌ శిక్షకుడి పాత్రలో కనిపించనున్నారు. ఫుట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ ఫుట్‌బాల్‌ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారిన వీధి బాలలను మామూలు మనుషులుగా మార్చి వారితోనే ఫుట్‌బాల్‌ జట్టు తయారు చేస్తారు అమితాబ్‌. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మరాఠి చిత్రం ‘సైరాట్‌’ దర్శకుడు నాగరాజ్‌ మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

‘సైరాట్‌’తో జాతీయ పురస్కారం సాధించిన దర్శకుడు నాగరాజ్‌ మంజులే, బాలీవుడ్‌ మెగాస్టార్‌ కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి గురువు పాత్రలో అమితాబ్‌ నటించిన సైరా నరసింహారెడ్డి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలోనూ అమితాబ్‌ గురువుగా కనిపించనుండటంతో ఆసక్తి రెట్టింపయ్యింది. కాగా ఈ సినిమా సైరా నరసింహారెడ్డితో పాటు విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా ఈ ఏడాది జూన్ లో విడుదలకానుంది.