బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తిరిగి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. `కౌన్‌ బనేగా కరోడ్‌పతి`(కేబీసీ) షోలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కరోనా నుంచి బిగ్‌బీ, ఆయన ఫ్యామిలీ కోలుకుని సురక్షితంగా ఇంటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇక కౌన్‌ బనేగా కరోడ్‌పతి షురూ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. 

హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతి బాగా ఫేమస్‌ అయిన విషయం తెలిసిందే. దీనికి అమితాబ్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత తిరిగి ఈ షో 12వ సీజన్‌ ని ప్రారంభించారు. కానీ అంతలోనే అమితాబ్‌ కరోనాకి గురయ్యారు. దీంతో అది వాయిదా పడింది. ఇప్పుడు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో తిరిగి షూట్‌ ప్రారంభించాలను నిర్ణయించారు. ఈ విషయాన్ని అమితాబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. 

అత్యంత భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ షోని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో షూటింగ్‌ చేయడం అవసరమా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఇలాంటి మాటలు మీ దగ్గరే పెట్టుకోండి. సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోతామా? జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో రెండు రోజుల షెడ్యూల్‌ని ఒక్కరోజులోనే పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్‌పై కనిపిస్తా` అని బిగ్‌ బీ పేర్కొన్నారు. అమితాబ్‌లోని ఉత్సాహం, పని పట్ల ఉన్న నిబద్ధత, స్పిరిట్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అందుకే మీరు మెగాస్టార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.