ఇటీవల బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలటంతో బాలీవుడ్ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా షాక్ అయ్యారు. అమితాబ్‌ తో పాటు ఆయన తనయుడు బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌, కోడలు, హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌కు కూడా పాజిటవ్‌ రావటం సంచలనంగా మారింది. అయితే అమితాబ్ బచ్చన్‌ వయసు ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు కరోనా సోకిందంటే అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

బిగ్‌ బీ త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీ ట్విటర్ వేదికగా విష్ చేశారు. అదే సమయంలో అభిమానులు తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ పూజలు కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో అమితాబ్‌ కరోనా నుంచి కోలుకున్నారంటూ ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు రావటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అమితాబ్‌ కరోనా నుంచి కోలుకున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలను అమితాబ్‌ సోషల్ మీడియా వేదికగా ఖండించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోయినా తాను కోలుకున్నట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు బిగ్‌ బీ. దీంతో మరోసారి అభిమానులు నిరాశ నెలకొంది. అమితాబ్ తో పాటు అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్యలు ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.