కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌కి పార్టీ ఇవ్వబోతున్నారు. దీంతోపాటు ఆస్కార్ విన్నర్స్ ని ఆయన ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 23న హైదరాబాద్‌కు రానున్నారు. ఆదివారం రోజున ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కి చేరుకుంటారు. అక్కడ సమీపంలోని నోవాటెల్‌కి మధ్యాహ్నం 3.30 సమయంలో చేరుకుంటారు. అక్కడ నాలుగు గంటల సమయంలో `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌తో తేనీటి విందులో పాల్గొననున్నారు అమిత్ షా.
దీనికి సంబంధించి ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి సహా `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌కి విందుకి సంబంధించిన ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ఇటీవల ఒరిజినల్ సాంగ్ విభాగంలో `నాటు నాటు` పాటకి ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. దీంతో వీరిని ఇప్పటికే చిరంజీవితోపాటు ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేకంగా సత్కరించింది.
మరోవైపు ఇప్పటికే రామ్‌చరణ్‌ని ఢిల్లీలో అమిత్ షా సత్కరించారు. చిరంజీవితోపాటు చరణ్ ఆయన్ని కలిసిన విషయం తెలిసిందే. దీంతోపాటు గతంలో అమిత్ షా హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ని కలిశారు. ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌ని హోంమంత్రి సన్మానించబోతుండటం పట్ల సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రాజకీయంగానూ ఇది చర్చనీయాంశంగా మారుతుండటం విశేషం. `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌తో భేటీ అనంతరం అమిత్ షా చేవెళ్ల వేదికగా జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్`లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్, అలియాభట్ కథానాయికలుగా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా సుమారు 12వందల కోట్లు వసూలు చేసింది.
