బాలీవుడ్ స్టార్ హీరోలలో అమీర్ ఖాన్ పంధానే వేరు. కమర్షియల్ సినిమాలకు భిన్నమైన సబ్జక్ట్స్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత ఆయనది. త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ వంటి చిత్రాలు ప్రయోగాత్మకంగా తెరకెక్కి భారీ విజయాలు నమోదు చేశాయి. సినిమా అంటే ఒక యజ్ఞంగా భావించే అమీర్ ఖాన్ పాత్రకు అనుగుణంగా తన శరీర ఆకృతిని కూడా మార్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాగా తాజా సినిమా కోసం అమీర్ ఖాన్ ఏకంగా తన మొబైల్ ని త్యాగం చేశారట. 

అమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీలో నటిస్తున్నారు. పర్సనల్ మొబైల్ కారణంగా ఆయన సినిమాపై మరియు నటనపై దృష్టి పెట్టలేకపోతున్నాని భావించారట. దానితో మొబైల్ వాడకం ఆపేయాలని డిసైడ్ అయ్యారట. లాల్ సింగ్ చద్దా మూవీ విడుదల అయ్యేవరకు వ్యక్తిగత మొబైల్ వాడకూడదని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారట. సన్నిహితులు కానీ, పరిశ్రమకు చెందినవారు కానీ, ఏదైనా ముఖ్య సందేశం పంచుకోవాలంటే తన మేనేజర్ కి కాల్ చేయాలని ఆయన సూచించడం జరిగిందని సమాచారం. 

మొబైల్ లేకపోతే క్షణం కూడా గడపలేని తరుణంలో ఏకంగా నెలల తరబడి ఫోన్ కి దూరంగా ఉండడం అనేది నిజంగా పెద్ద పరీక్ష లాంటిదే అనాలి. ఇక లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్. ఈ మూవీలో అమీర్ ఖాన్ కి జంటగా కరీనా కపూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కరీనా షూటింగ్ కి హాజరు కావడం లేదని సమాచారం. అమీర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది .