దక్షిణాది హీరోయిన్లలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా అమలాపాల్ మంచి గుర్తింపు పొందింది. అయితే తతప్పుడు ధృవ పత్రాలు సమర్పించి పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన కేసులో అమలాపాల్ అడ్డంగా బుక్కయింది. తొలుత తనకేమీ తతెలియదని బుకాయించినా... చివరకు తప్పు ఒప్పుకుని నేరం అంగీకరించిందని తెలుస్తోంది. 

 

దీంతో ప్రొసీజర్ ప్రకారం అమలాపాల్‌ను కేరళ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె బెయిలుపై విడుదలైంది. గత ఏడాది ఆమె రూ. కోటి పెట్టి ఖరీదైన కారును కొన్నారు. దాన్ని తప్పుడు చిరునామా పత్రాలు ఉపయోగించి పాండిచ్చేరిలో రిజిస్టర్‌ చేయించారు. కేరళలో చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్ను ఎగవేయాలని అమలాపాల్‌ ఇలా చేశారని ఆరోపణలపై కేరళలో కేసు నమోదైంది. 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

 

ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ముందస్తు బెయిలు కోరుతూ కేరళ హైకోర్టును సంప్రదించారు. కానీ న్యాయస్థానం.. ముందు క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తప్పును ఒప్పుకున్నట్లు సమాచారం. దీని తర్వాత న్యాయస్థానం బెయిలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసు గురించి పదే పదే ప్రశ్నించినా అమలాపాల్‌ మీడియా ముందు ఒక్కసారి కూడా నోరుమెదపలేదు. ఇదేకోవలో పన్ను ఎగవేతపై మళయాల నటులు సురేశ్‌ గోపి, ఫహద్‌ ఫాజిల్‌లపై కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి.