ప్రముఖ దిగ్గజ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 101 వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు అర్జున్‌ తనయుడు అయాన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం విశేషం.

అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌. తన తండ్రి అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు నిర్మాత అల్లు అరవింద్‌. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్‌ పార్క్ లో ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. అయితే మనవడి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌, చిరంజీవి సతీమణి సురేఖ, హీరో అల్లు శిరీష్‌, అల్లు అర్జున్‌ కూతురు అర్హతోపాటు వారి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూల మాల వేసి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. 

గతేడాది అల్లు రామలింగయ్య వందవ జయంతిని పురస్కరించుకుని అల్లు స్టూడియోని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లు బిజినెస్‌ పార్క్ లో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేయడం విశేషం. ఇక ఈ సందర్భంగా బన్నీ తనయుడు అల్లు అయాన్‌ మాట్లాడుతూ `అల్లు రామలింగయ్య తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా.. ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి` అని అన్నాడు. 

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అల్లు రామలింగయ్య గారితో ఉన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వెయ్యి సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు అల్లు రామలింగయ్య. టాలీవుడ్ లో మూడు తరాల సినీ ప్రేక్షకులను ఆయన అలరించారు. తనదైన నటనతో యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ ప్రజానీకాన్ని అలరించిన అల్లు రామలింగయ్య తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారు. 

అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మిస్ అయ్యారు. ఆయనతోపాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా హాజరు కాకపోవడం గమనార్హం. అయితే బన్నీ ప్రస్తుతం `పుష్ప2` చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. బన్నీ.. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది.