స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్  లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సాప్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్. అయితే ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ లేకపోవటంతో అల్లు అర్జున్ ఎట్టి  పరిస్దితుల్లోనూ డిసెంబర్ రిలీజ్ పెట్టాలని ప్రెజర్ పెడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  

దాంతో ఓ నెల ముందుగా పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్దితి త్రివిక్రమ్ టీమ్ ది.  దాంతో ప్రతీ పని పరుగులు పెడుతూ చేస్తున్నారట. షూటింగ్ ప్రారంభం లేటు కాకపోతే ఈ సమస్య ఉండేది కాదని అంటున్నారు. 

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు  అల్లు అర్జున్‌. ఇప్పుడు దాన్ని కవర్ చేయాలనే ఆలోచనలో  ఉన్నారు. మరో ప్రక్క త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నారు. గతంలో వీరి కాంబినేషనలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే అల్లు అర్జున్ తో డీజే సినిమాకి పనిచేసింది. ఈ సినిమాలో కీలకపాత్రల్లో  నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణలు,  మలయాళ నటుడు జయరామ్‌ బన్నీ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ మరియు యు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.