టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాల్లో ఎంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడో బయటకు కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా తన సినిమాల ప్రమోషన్‌ సందర్భంగా ఇచ్చే ఇంటర్వ్యూలలో బన్నీ కామెంట్స్ అభిమానులను మరింతగా అలరిస్తుంటాయి. తాజాగా బన్నీ గతంలో చేసిన ఓ ఇంట్రస్టింగ్ కామెంట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో తన అభిమాన హీరోలు గతంలో చేసిన కామెంట్స్‌ను షేర్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. అలా బన్నీ కామెంట్‌ తెర మీదకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ తన ఫేవరెట్ హీరోయిన్‌కు పెళ్లి అయిన సందర్భంలో తాను ఎంతో బాధపడ్డానని చెప్పాడు అల్లు అర్జున్‌.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పెళ్లి సందర్భంగా చాలా అమ్మాయిలు తమ బాధను వ్యక్తపరుస్తూ బన్నీకి మెసేజ్‌లు చేశారట. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసని చెప్పాడు బన్నీ. అందాల రాశి ఐశ్వర్య పెళ్లి అయినప్పుడు తాను కూడా అంతే బాద పడ్డానని చెప్పుకొచ్చాడు. ఐశ్వర్యరాయ్‌  2007లో బాలీవుడ్‌ హీరో అభిషెక్‌ బచ్చన్‌ను వివాహం  చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్‌, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా.. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.