అల్లు అర్జున్‌.. ఓ తమిళ సినిమాని రిజెక్ట్ చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పుడు మరో స్టార్‌ హీరో సినిమాకి నో చెప్పినట్టు తెలుస్తుంది. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఓ వైపు `పుష్ప2`లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్‌ ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. ఇది అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గానూ నిలిచింది. లైక్స్, వ్యూస్ పరంగా దుమ్మురేపుతుంది. పుష్పరాజ్‌గా బన్నీ మరోసారి వెండితెరపై తన విశ్వరూపం చూపించబోతున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బన్నీకి సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇటీవల హాట్‌ టాపిక్‌ అయ్యాయి. 

అల్లు అర్జున్‌.. ఓ తమిళ సినిమాని రిజెక్ట్ చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. `వాడచెన్నై`లో ఓ ముఖ్య పాత్ర కోసం బన్నీని కలవగా, ఆయన నో చెప్పారని తెలిపారు. మరో హీరో సినిమాలో సెకండ్‌ లీడ్‌ తరహా పాత్రలో నటించడం ఇష్టం లేక ఆయన రిజెక్ట్ చేశారట. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాకి బన్నీ నో చెప్పారని సమాచారం. ఆయన బాలీవుడ్‌లో పెద్ద స్టార్‌ హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఆఫర్‌ని తిరస్కరించినట్టు సమాచారం. 

బాలీవుడ్‌లో ఇటీవల `పఠాన్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారూఖ్‌ ఖాన్‌.. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో `జవాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. నయనతార ఇందులో కథానాయిక. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్‌ కోసం బన్నీని సంప్రదించారు అట్లీ టీమ్‌. మొదట ఆయన ఆసక్తి చూపించారని వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటించడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియాని మించి విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పాత్రలో కనిపిస్తే అది ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసే అవకాశం ఉంటుందని తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే `జవాన్‌`లో తనకు ఆఫర్‌ చేసిన పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేకపోవడంతో బన్నీ నో చెప్పారనేది మరో టాక్‌. నిజం ఏదైనా బన్నీ ఇందులో నటించడానికి ఆసక్తిగా లేడనేది వాస్తవమట. అయితే తమిళ హీరో విజయ్‌.. గెస్ట్ రోల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

`పుష్ప`తో సంచలనాలు క్రియేట్‌ చేశారు బన్నీ. అంతకు ముందు `అల వైకుంఠపురములో` చిత్రంతోనే ఇండస్ట్రీకి ఝలక్‌ ఇచ్చారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించి పెద్ద షాకిచ్చింది. దాన్ని కొనసాగిస్తూ `పుష్ప`తో పుష్పరాజ్‌గా విశ్వరూపం చూపించారు. ఇప్పుడు దాన్ని మించి `పుష్ప2`తో రాబోతున్నారు. ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో భిన్నమైన షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఆయన అమ్మోరుని తలపించేలా ఉన్న లుక్‌ గూస్‌బంమ్స్ తెప్పించింది. ఇది అందరిని ఫిదా చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.

సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప2` సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొనబోతుందట. అలాగే అనసూయ, సునీల్‌, రావురమేష్‌ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫహద్‌ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే బన్నీ గతేడాది కూడా రాలేదు, ఈ ఏడాది కూడా తన అభిమానులను డిజప్పాయింట్‌ చేయబోతున్నాడు.