ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త సినిమాని ప్రకటించారు. అనేక దర్శకుల పేర్ల అనంతరం తాజాగా అదిరిపోయే కాంబినేషన్‌ని ప్రకటించారు. `అర్జున్‌రెడ్డి` దర్శకుడితో సినిమా చేయనున్నట్టు వెల్లడించారు.

ఐకాన్‌ స్టార్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. సుకుమార్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ఇది. `పుష్ప` సంచలన విజయం అనంతరం దానికి పార్ట్ 2గా ఈ చిత్రం రూపొందుతుంది. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తి, సస్పెన్స్ నెలకొంది. చాలా మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. 

బోయపాటి శ్రీను, ఏఆర్‌ మురుగదాస్‌, అట్లీ, ప్రశాంత్‌ నీల్‌, సంజయ్‌ లీలా భన్సాలీ వంటి పేర్లు వినిపించాయి. కానీ ఏది ముందుగా రాబోతుందనేది పెద్ద సస్పెన్స్. కానీ ఊహించని విధంగా కొత్త కాంబినేషన్‌ తెరపైకి వచ్చింది. `అర్జున్‌రెడ్డి`తో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు బన్నీ. తాజాగా శుక్రవారం ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఊహించని ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసి తన ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ. 

సందీప్‌రెడ్డి వంగా.. విజయ్‌ దేవరకొండతో `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని రూపొందించింది సంచలనం సృష్టించారు. ఈ సినిమా బోల్డ్ కంటెంట్‌తో, ఇంటెన్స్ లవ్‌ స్టోరీగా రూపొంది మెప్పించింది. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. దీనిపై పలు విమర్శలు, ట్రోల్స్ రావడం విశేషం. అయినా సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్‌ కొత్త పుంథలు తొక్కేందుకు దోహద పడింది. ఆ తర్వాత ఇదే సినిమాని బాలీవుడ్‌లో `కబీర్‌ సింగ్‌`తో రీమేక్‌ చేసి హిట్‌ కొట్టాడు సందీప్‌రెడ్డి వంగా. ఇప్పుడు రణ్‌ బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` సినిమా చేస్తున్నారు. అనంతరం అల్లు అర్జున్‌ సినిమా చేయబోతున్నారు. 

బన్నీ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యే అవకాశం ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, అనసూయ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇక బన్నీ హీరోగా సందీప్‌రెడ్డి వంగా రూపొందించే చిత్రానికి బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఇంపాక్ట్ గట్టిగా ఉండేదని దర్శకుడు సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చాడు. మరి ఈసారి అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న సందీప్ ఐకాన్ స్టార్ ను ఏ రేంజ్ లో చూపించనున్నాడో చూడాలి. ఈ కాంబినేషన్‌ ప్రకటనతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సహం నింపారు బన్నీ.