స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేగం పెంచుతున్నాడు. 2020 బన్నీ నుంచి రెండు చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలోని చిత్రం కూడా మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. 

ఈ నెలలోనే పూజాకార్యక్రమాలు నిర్వహించి, సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఎర్రచందం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఈ చిత్ర కథని చాలా ఉత్కంఠభరితంగా సిద్ధంచేసాడట. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది తెలియాల్సి ఉంది. రంగస్థలం చిత్రంతో రికార్డు విజయాన్ని అందుకున్న సుకుమార్ ప్రస్తుతం బన్నీతో హ్యాట్రిక్ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 చిత్రాలొచ్చాయి.