హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా… ఇలా పలు ఓటీటీ వేదికలు పోటీ పడుతున్నాయి. దాంతో ఇప్పుడు తెలుగులో కూడా నిర్మాతలు వెబ్ సిరీస్ నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత‌ అల్లు అరవింద్ కూడా ముందున్నారు. ఆయన స్వయంగా ఆహా అనే ఓటీటి ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేయటంతో కంటెంట్ అధికంగా అవసరం అవుతోంది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో జనం ఈ వెబ్ సీరిస్ లను తెగ చూస్తున్నారు.  ఈ నేపధ్యంలో `ఆహా` ప్లానింగులూ భారీగా ఉన్నాయి. ఈ డిసెంబ‌రు లోపు ఏకంగా 20 వెబ్ సిరీస్‌లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి 12 వెబ్ సిరీస్‌లు నిర్మిస్తే చాల‌నుకున్నా...  ఓటీటీ ల‌కు ఉన్న డిమాండ్ గ‌మ‌నించిన అల్లు అర‌వింద్ ఆ సంఖ్య‌ని 20కి పెంచినట్లు సమాచారం. అయితే ఆ కంటెంట్ విషయంలో మాత్రం అరవింద్ కొన్ని రూల్స్ రెడీ చేసారట. 

 నిజానికి  తెలుగు జనాలకు సరపడే అంత కంటెంట్ ..ఆహా లో లేదు. సిన్, కొత్త పోరడు వంటి కొన్ని వెబ్ సీరిస్ లు ఇచ్చినా సరిపోవటం లేదు. కరోనా తో ఇంత డిమాండ్ వస్తుందని అల్లు అరవింద్ సైతం ఊహించలేదు. దాంతో ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయగానే ఎలాగో సినిమాలు ప్రారంభమయ్యే వాతావరణం కనపడటం లేదు కాబట్టి..లిమిటెడ్ బడ్జెట్, అధిక జాగ్రత్తలు, లిమిటెడ్ స్టాఫ్ తో షూటింగ్ లు మొదలెట్టాలని ఆయన డిసైడ్ అయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  అలాగే తమ ఓటీటి ప్లాట్ ఫామ్ కు తీసే సినిమాలు పాటలు, డాన్స్ లు వద్దనకుంటున్నారట. 

కేవలం కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు అదీ రెండు గంటల్లో పూర్తయ్యే వాటికే ప్రయారిటీ ఇశ్తారట. కొత్త వాళ్లలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ అతి తక్కువ బడ్జెట్ తో అత్యధిక క్వాలిటీ వచ్చే ప్రాజెక్టులు తమ ఆహా ద్వారా తీసుకురావాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. ఆయన అనుకున్నట్లుగా జరిగితే మంచి కంటెంట్ తో ఆహా దూసుకుపోతుందనటంలో సందేహం లేదు.