అల్లరి నరేష్ మరోసారి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నారు. తాజాగా ఆయన `ఆల్కహాల్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ గురువారం విడుదలైంది. ఇది ఆల్కహాల్ చుట్టూ తిరగడం విశేషం.
రూట్ మార్చిన అల్లరి నరేష్
అల్లరి నరేష్ ప్రారంభంలో కామెడీ సినిమాలతో అలరించారు. వరుస విజయాలు అందుకున్నారు. కానీ ఆ కామెడీనే ఆయనకు మైనస్‌గా మారింది. అలాంటి చిత్రాలు ఆడలేదు. దీంతో రూట్ మార్చి క్రైమ్ థ్రిల్లర్స్ చేశారు. విజయాలు అందుకున్నారు. మళ్లీ మధ్యలో కామెడీ చిత్రాలు, ఫ్యామిలీ మూవీస్ చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరోసారి థ్రిల్లర్‌తో రాబోతున్నారు. కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ మేళవింపుతో `ఆల్కహాల్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది.
`ఆల్కహాల్` టీజర్ ఎలా ఉందంటే?
గురువారం విడుదలైన `ఆల్కహాల్` మూవీ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. 'ఆల్కహాల్' చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ సాగింది. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు, తాగిన తర్వాత అతని ప్రవర్తన, దాని చుట్టూ జరిగే సంఘటనల సమాహారాన్ని ఈ టీజర్ సూచిస్తుంది. హాస్యం మాత్రమే కాకుండా, నవరసాలను అద్భుతంగా పలికించగల నటుడిగా పేరుగాంచిన అల్లరి నరేష్, 'ఆల్కహాల్' రూపంలో మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందించబోతున్నారు. ఇందులో ఆయన సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో నరేష్, పూర్తిగా కొత్త మార్గంలో అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రేక్షకులలో ఉత్సుకతను పెంచుతుంది.
`ఆల్కహాల్` మూవీ టీమ్
సుహాస్ నటించిన 'ఫ్యామిలీ డ్రామా'తో విమర్శకుల ప్రశంసలతోపాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన, బలమైన సాంకేతిక విలువలతో కూడిన అద్భుతమైన కథాంశంతో తిరిగి వస్తున్నారు. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
'ఆల్కహాల్' టీజర్ లో సాంకేతిక నిపుణుల ప్రతిభ అడుగడుగునా కనిపించింది. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా జిజు సన్నీ, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. ఇక అల్లరి నరేష్‌తోపాటు రుహాని శర్మ, నిహారిక ఎన్.ఎం., సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, వెంకటేష్ కాకుమాను, కిరీటి వంటి తారాగణం నటిస్తోంది. టీజర్‌లో అల్లరి నరేష్, సత్యల మధ్య కామెడీ ఆద్యంతం ఆకట్టుకుంది. మందు చుట్టూతే సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీని కొత్త సంవత్సరం స్పెషల్‌గా జనవరి 1, 2026లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ మూవీతో అల్లరి నరేష్ మరో హిట్ అందుకుంటాడా? అనేది చూడాలి.

