హీరో రామ్ చరణ్ నేడు ఉదయాన్నే ఫ్యాన్స్ తో ఓ బ్యాడ్ న్యూస్ పంచుకున్నారు. ఆయన  కరోనా సోకిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ఎటువంటి లక్షణాలు కనిపించలేదని, త్వరలోనే కోలుకొని తిరుగు వస్తానని చరణ్ తెలియజేశారు. హోమ్ క్వారంటైన్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నానని ఆయన తెలియజేశారు. అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. 

రామ్ చరణ్ కి కరోనా సోకడంతో టాలీవుడ్ ని షాక్ గురి చేసింది. ఈ పరిణామం మెగా హీరోల సినిమాలు అన్నింటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రిస్మస్ పండుగను మెగా హీరోలందరూ కలిసి జరుపుకున్నారు. అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లతో పాటు, కళ్యాణ్ దేవ్ ఈ వేడుకలలో పాల్గొన్నారు. వీరందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. పరీక్షలలో నెగిటివ్ రిజల్ట్ వచ్చినా, వెంటనే షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. అల్లు అర్జున్ పుష్ప మూవీపై కూడా ఈ ప్రభావం పడనుంది. 

కాగా చరణ్ ఈ మధ్య ఆచార్య సెట్స్ కి వెళ్లారు. అక్కడ దర్శకుడు కొరటాల శివతో పాటు, మరికొందరితో ఆయన సన్నిహితంగా మెలిగారు. కావున ఆచార్య షూటింగ్ పై కూడా ఈ విషయం ప్రభావం చూపనుంది. అన్నింటికి మించి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎఫెక్ట్ కానుంది. కరోనా నుండి రామ్ చరణ్ పూర్తిగా కోలుకొనే వరకు ఆయన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేరు. నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తరువాత కూడా కొన్నాళ్లు, క్వారంటైన్ కావాల్సి వస్తుంది. మొత్తంగా రామ్ చరణ్ కి కోవిడ్ సోకడం అనేక చిత్రాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది.