ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ని ప్రకటించగానే ఆమె తెలుగు నాట కూడా పాపులర్ అయిపోయింది. ఆమె పర్శనల్ విషయాల నుంచి , ఆమె మాట్లాడే ప్రతీ మాట తెలుగులో సైతం  హాట్‌ టాపిక్‌గా మారుతోంది. 

తాజాగా ఆలియా భట్ తన రాజకీయ పార్టీ గుర్తేంటో చెప్పసింది.  కంగారు పడకండి ఆమె రాజకీయాల్లోకి రాలేదుగానీ, వస్తే మాత్రం 'ప్లేట్'ను తన గుర్తుగా ఎంచుకుంటానని చెప్పింది. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆమె, ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్లినా రాజకీయాల ప్రస్తావన వస్తోందని, మీడియా కూడా ఇవే ప్రశ్నలు వేస్తోందని చెప్పింది. అలాగే  ఆమె, 'ప్లేట్' గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదని, జీవితంలో ప్లేట్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని వ్యాఖ్యానించింది. 

ప్రస్తుతం తాను నటించిన 'కళంక్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, కపిల్ శర్మ షోలో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంది. ఇక ఆలియా భట్ కే వేసిన ప్రశ్నను వరుణ్ ను అడుగగా, తాను 'చెడ్డీ'ని గుర్తుగా ఎంచుకుంటానని చెప్పడంతో, పోగ్రాంలో పాల్గొన్న వారంతా  నవ్వుల్లో మునిగిపోయారు. 

కాగా, ఆలియా, వరుణ్ లతో పాటు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్ కపూల్ తదితరులతో నిర్మాత కరణ్ జోహార్ 'కళంక్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవలే సినిమా టీజర్, ట్రయిలర్ విడుదల కాగా,  మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌  హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.