మలయాళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన `అలప్పుజ జింఖానా` చిత్రం ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. ఓటీటీలో నవ్వులు పూయించేందుకు వస్తుంది.

ఈ వారం ఓటీటీలోకి మరో బ్లాక్‌ బస్టర్‌ మూవీ రాబోతుంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన `అలప్పుజ జింఖానా` మూవీ ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్‌ ఆడియెన్స్‌ ని నవ్వించేందుకు వస్తుంది. ఈ నెల 13న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీ లివ్‌లో `అలప్పుజ జింఖానా` 

సోనీ లివ్‌లో జూన్‌ 13 నుంచి `అలప్పుజ జింఖానా` మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం, అలాగే సోనీలివ్‌ అధికారికంగా ప్రకటించింది. `అలప్పుళ జింఖానా` స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా రూపొందింది. ఆటలతోపాటు నవ్వులు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇది తక్కువ బడ్జెట్‌తో రూపొంది సంచలన విజయం సాధించింది.

థియేటర్లలో దుమ్ములేపిన `అలప్పుజ జింఖానా`

`అలప్పుజ జింఖానా` ఏప్రిల్‌ 10న కేరళాలో థియేటర్లలో విడుదలైంది. అక్కడ పాజిటివ్‌ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్లోగా పుంజుకుని ఆ తర్వాత పికప్‌ అందుకుంది. ఊహించనివిధంగా థియేటర్లలో సందడి చేసింది.

 తెలుగులోనూ విడుదలై అలరించింది. కేవలం రూ.12 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫైనల్‌గా రూ.72కోట్లు వసూలు చేయడం విశేషం. ఇది మలయాళ మేకర్స్ ని సర్‌ప్రైజ్‌ చేసింది. అంతేకాదు అత్యధిక వసూళ్లని రాబట్టిన మలయాళ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

`అలప్పుజ జింఖానా` చిత్ర బృందం

`అలప్పుజ జింఖానా` చిత్రానికి ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించటంతో పాటు జాబిన్ జార్జ్, సమీర్ కరాట్, సుబీష్ కన్నంచేరి క‌లిసి నిర్మించారు. ఇందులో `ప్రేమలు` ఫేమ్‌ నస్లెన్, లుక్‌మాన్ అవరాన్, గణపతి ఎస్. పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు నటించారు. క‌థ‌లోని చ‌క్క‌టి కామెడీని, గందరగోళాన్ని బ్యాలెన్స్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ చిత్రం అంద‌రినీ అల‌రించింది.

`అలప్పుజ జింఖానా` కథేంటంటే

‘అల‌ప్పుజ జింఖానా’ కథేంటో చూస్తే... ప్రధాన పాత్రధారి జోజో జాన్సన్ (నస్లెన్), ఓ కాలేజీ విద్యార్థి. ఇతడు ముచ్చట‌ప‌డి త‌న‌కు న‌చ్చిన కాలేజీలోకి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ కావ‌టానికి బాక్సింగ్‌లో చేరతాడు. అయితే అతడు తన స్నేహితులతో కలిసి కఠినమైన, అసలు బాక్సింగ్‌ను నేర్పించే కోచ్ ఆంటోనీ జోషువా (లుక్‌మాన్ అవరాన్)ను కలిసినప్పుడు కథలో అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. 

మరి కోచింగ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాణాలు చోటు చేసుకున్నాయి? జాన్సన్‌ ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? అంతేకాదు తనకిష్టమైన కాలేజీలో జాన్సన్‌ చేరాడా? అనేది మిగిలిన కథ.

ఈ సినిమా గురించి న‌స్లెన్ మాట్లాడుతూ, `అలప్పుజ జింఖానా` చిత్రంలో నేను జోజో పాత్రలో నటించటం మంచి అనుభూతినిచ్చింది. ఈ పాత్ర‌లో న‌టించ‌టం ద్వారా నాలోని బ‌ల‌హీన‌త‌లు, బ‌లాల‌ను తెలుసుకోగ‌లిగాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌టం చాలా సంతోషంగా ఉంది. జూన్‌13న సోనీ లివ్ ద్వారా యావ‌త్ దేశం ఈ చిత్రాన్ని వీక్షించ‌నుంది` అని చెప్పారు.