అల్లు అర్జున్‌  హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే, నివేది పేతురాజు హీరోయిన్స్ గా రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ స్టైల్‌, నటన, కామెడీ టైమింగ్‌, త్రివిక్రమ్‌ దర్శకత్వం, పూజ గ్లామర్ ఈ సినిమాను ఇప్పటికీ రికార్డ్ ల వర్షం కురిపించేలా చేస్తున్నారు.  

కరోనా ఎఫెక్ట్ తో  థియేటర్లన్నీ మూతపడ్డా ఈ సినిమా మాత్రం రికార్డులు తిరగరాస్తూనే ఉంది.  తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వారు సౌత్ లో అత్యధికంగా చూసిన సినిమాల్లో టాప్‌-10 చిత్రాలను ఆ సంస్థ ప్రకటించింది. దీనిలో బన్నీ నటించిన ‘అలవైకుంఠపురములో’ చిత్రం  మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో దుల్కర్‌ సల్మాన్ నటించిన తమిళ చిత్రం‌ ‘కన్నం కన్నం కొల్లయ్యదితల్‌’, అన్నాబెన్‌ నటించిన మలయాళ చిత్రం ‘కప్పెలా’, సత్యదేవ్‌ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఉన్నాయి. 

అలాగే, ఇటీవల ఈ చిత్రం టీవీల్లో ప్రసారమైంది. అత్యధికంగా 29.4 టీఆర్‌పీతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిందని చిత్ర టీమ్ తెలిపింది. ఈ మేరకు సంగీత దర్శకుడు తమన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘సినిమా విడుదలై ఆరు నెలలు దాటింది. ఓటీటీలోనూ విడుదలైంది. అయినా, అల వైకుంఠపురం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 29.4 టీఆర్‌పీతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’’ అని ట్వీట్‌ చేశారు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విజయాల తర్వాత త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అలవైకుంఠపురములో’. హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు ఈ సినిమా నిర్మించారు. ఇక తమన్‌ అందించిన పాటలు యూత్ ని ఊపేసాయి. ‘సామజవరగమన’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు చిన్నా పెద్దా అందరూ ఫిదా అయిపోయారు.