అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’. నవంబరు 9న ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది. అదే రోజున న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈలోని థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కాంచన’ సినిమాకు హిందీ రీమేక్‌ ‘లక్ష్మీ బాంబ్‌’. మాతృకను తీసి, నటించిన లారెన్స్‌ దీన్ని కూడా రూపొందించారు. కియారా అడ్వాణీ హీరోయిన్. కొన్ని మార్పులతో హిందీ ప్రేక్షకులకు తగ్గట్టు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే చివర నిముషంలో ఈ సినిమా టైటిల్ మార్పు చేసారు. అయితే టైటిల్ ని కుదించటమే ఈ మార్పు. ఇంతకు ముందు ‘లక్ష్మీ బాంబ్‌’ అని ఉన్న ఈ టైటిల్ ‘లక్ష్మీ‌’ గా మిగిలింది.  అక్షయ్‌ సినిమా ఓటీటీ వేదికలో విడుదలకి సిద్ధమవుతుండడం ప్రేక్షకుల్ని, బాలీవుడ్‌ వర్గాల్ని ఆసక్తికి గురిచేస్తోంది.

 ‘లక్ష్మీ బాంబ్‌’ టైటిల్ తో హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ శ్రీరాజ్‌పుత్ కర్ణి సేన నుండి మేకర్స్ లీగల్ నోటీసు అందుకోవటంతో టైటిల్ మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ  నోటీసు ప్రకారం, ఈ చిత్రం టైటిల్ లక్ష్మీ దేవికి అగౌరవంగా పరుస్తున్నట్లు ఉందని, తద్వారా హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసింది అన్నారు. 

 లారెన్స్ టైటిల్ విషయమై స్పందిస్తూ... “మా తమిళ చిత్రంలో ప్రధాన పాత్రకు కాంచన పేరు పెట్టాం. కాంచన అంటే ‘బంగారం’… అంటే లక్ష్మీ రూపం. ఇంతకుముందు నేను హిందీ రీమేక్ కోసం అదే టైటిల్ పెట్టాలని భావించాను. కానీ ఈ పేరు హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించాలి. దీంతో మెరుగైన టైటిల్ కోసం ఆలోచించాం. లక్ష్మీ బాంబ్ అయితే  బాగుంటుందని యూనిట్ అంతా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం ” అని లారెన్స్ తెలిపారు. లక్ష్మీ బాంబ్ ధమాకా ఏ మాత్రం మిస్ అవ్వదు…శక్తివంతమైన ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం ఈ పేరు పక్కగా సెట్ అవుతుందని ఆయన చెప్పారు.