Akshay Kumar అక్షయ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి మాట్లాడారు. చిన్నప్పుడు ఆర్మీలో చేరాలని కలలు కన్నానని, కానీ అది నిజం చేసుకోలేకపోయానని చెప్పారు. .
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లైఫ్ లో ఎదురైన ఇబ్బందుల గురించి రీసెంట్ గా వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, తను 7వ తరగతిలో ఫెయిల్ అయ్యాడట. దాని ఫలితంగా ఇంట్లో వాళ్ల నాన్న చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అక్షయ్ ఇటీవల రజత్ శర్మ షో 'ఆప్ కీ అదాలత్'లో బయటపెట్టారు. ఈ సందర్భంగా, తన తండ్రి హరి ఓం భాటియా ఆర్మీలో ఉన్నప్పటికీ, తను ఎందుకు ఆర్మీలో చేరలేకపోయానో కూడా చెప్పారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, "మా నాన్న ఆర్మీలో ఉండేవారు, నేను కూడా సైన్యంలో చేరాలని ప్రయత్నించాను. కానీ నేను అంతగా చదువుకోలేకపోయాను." ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా చేరాలనుకున్నానని, కానీ చదువు అడ్డంకిగా మారిందని అక్షయ్ చెప్పారు.
చదువుపై ఆసక్తి లేదు
అక్షయ్ ప్రకారం, అతనికి చదువుపై అస్సలు ఆసక్తి ఉండేది కాదు. కానీ వాళ్ల నాన్న చాలా తెలివైనవారు. అక్షయ్ మాటల్లో, "నాన్న చాలా తెలివైనవారు, 'నాయనా, 12వ తరగతి వరకు చదువు. ఆ తర్వాత నువ్వు ఏది చెబితే అది చేద్దాం' అనేవారు." ఆ సమయంలో బ్రూస్ లీ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, దానివల్ల మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి పెరిగి, అది నేర్చుకోవడానికి బ్యాంకాక్ వెళ్లానని చెప్పాను. అక్కడ మెట్రో గెస్ట్ హౌస్ అనే చిన్న దాబాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిటర్‌గా పనిచేసి, రాత్రిపూట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాడినని తెలిపారు. మూడు, నాలుగేళ్లు అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, తర్వాత భారత్‌కు వచ్చి ఇతరులకు నేర్పించడం మొదలుపెట్టాను. అదే సమయంలో ఒక విద్యార్థి తండ్రి, తనే ఒక మోడల్ కో-ఆర్డినేటర్ కావడంతో, అతనికి మోడలింగ్ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మోడలింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మోడల్ గా నా జీతం 21 వేలు, ఎంతో కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తే వచ్చేది 6 వేలు మాత్రమే కాని, ఏసీరూమ్ లో కూర్చుని మోడలింగ్ చేస్తు 21 వేలు ఇచ్చారు అని అక్షయ్ అన్నారు.
హీరో అయిపో అన్నది ఎవరు?
గోవిందాయే తనను హీరో అవ్వమని చెప్పిన మొదటి వ్యక్తి అని అక్షయ్ కుమార్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, "జయేశ్ సేఠ్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. నేను అతని దగ్గర లైట్‌మ్యాన్‌గా పనిచేసేవాడిని. పెద్ద పెద్ద నటులు వచ్చేవారు. గోవిందా గారు, సంగీతా బిజ్లానీ, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ గారు వచ్చేవారు. ఫోటోషూట్ సమయంలో నేను వాళ్ల ముఖాలపై లైటింగ్ చేసేవాడిని. అప్పుడు గోవిందా గారు నాతో, 'ఏయ్! నువ్వు బాగున్నావురా. హీరో అయిపో. హీరోగా బాగుంటావు' అన్నారు. అలా చెప్పిన మొదటి వ్యక్తి ఆయనే." అని అక్షయ్ కుమార్ అన్నారు.
అక్షయ్ కుమార్‌ను నాన్న చెంపదెబ్బలు కొట్టినప్పుడు
ఈ సంభాషణను కొనసాగిస్తూ, గోవిందా కంటే ముందే తనే తనను హీరోగా ఊహించుకున్నానని అక్షయ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, "నాకు ఇంకో విషయం గుర్తుంది. నేను ఏడో తరగతి ఫెయిల్ అయినప్పుడు, మా నాన్న రెండు మూడు చెంపదెబ్బలు కొట్టారు. 'నాయనా, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు?' అని అడిగారు. అప్పుడు నా నోటి నుంచి అనుకోకుండా 'నేను హీరో అవ్వాలి' అనే మాట వచ్చింది. నిజానికి అప్పుడు నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. అలా అనేశాను. కాబట్టి, మొదట నేను నాకు నేను చెప్పుకున్నాను హీరో అవ్వాలని, ఆ తర్వాత గోవిందా గారు చెప్పారు." అని అక్షయ్ అన్నారు.
