బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగానే కనిపించే ఈ నటుడు ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ లో మాత్రం కనిపించలేదు. 

బాలీవుడ్ లో చాలా మంది సినీ తారలు ఓటేసి, సిరా చుక్కతో ఫోటో దిగి పోస్ట్ చేస్తుంటే అక్షయ్ మాత్రం కనిపించలేదు. అతడి భార్య ట్వింకిల్ కూడా ఓటేసింది కానీ అక్షయ్ ఓటేయలేదు. పోలింగ్ కి కొన్నిరోజులముందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాలిటిక్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్ ఓటు వేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

మోదీ.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య కల్పించాలంటూ ట్విట్టర్ లో విజ్ఞప్తి చేస్తూ ట్యాగ్ చేసిన వారిలో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో మోదీ ట్వీట్ కి బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తివంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అక్షయ్ చెప్పుకొచ్చారు. కానీ పోలింగ్ రోజు మాత్రం  కనిపించలేదు.

మంగళవారం నాడు ఆయన ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని బయటకి వచ్చిన సమయంలో మీడియా సభ్యులు కొందరు.. ఓటు ఎందుకు వేయలేదని ప్రశ్నించగా.. వదిలేయండి అంటూ సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.