గతేడాది మీటూ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటకి వచ్చింది. అలా మీటూలో దోషులైన వారికి ఇండస్ట్రీలో పని లేకుండా పోయింది. వారిలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా ఉన్నారు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఆయనకి మంచి పేరుంది.

అలాంటిది ముగ్గురు నటీమణులు తమను సాజిద్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు బయటకి వచ్చిన సమయంలో సాజిద్ 'హౌస్ ఫుల్ 4' సినిమాని డైరెక్ట్ చేయాల్సివుంది కానీ నిర్మాణ సంస్థ అతడిని తప్పించింది. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

ఈ క్రమంలో సినిమాలో హీరోగా నటించిన అక్షయ్ కి మీడియా వర్గాల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. భవిష్యత్తులో సాజిద్ ఖాన్ తో కలిసి పని చేస్తారా..? అని అక్షయ్ ని ప్రశ్నించగా.. అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ ముగ్గురు అమ్మాయిలు సాజిద్ తమను లైంగికంగా వేధించాడంటూ న్యాయం కోసం మీడియా ముందుకొచ్చారని.. వారు చెబుతోంది నిజమో కాదో న్యాయస్థానం నిర్ణయిస్తుందని అన్నారు.

ఒకవేళ ఈ కేసులో సాజిద్ నిర్దోషి అని ప్రూవ్ అయితే తప్పకుండా అతడితో కలిసి సినిమా చేస్తానని అన్నారు. లేకపోతే అసలు ఆయన ముఖం కూడా చూడనని అన్నారు. ఈ సినిమా క్రెడిట్స్ విషయంలో సాజిద్ కి క్రెడిట్ ఇవ్వలేదని.. ఇది తను తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయమని అన్నారు.