తొలి విజయం కోసం అఖిల్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆశీర్వాదం కోసం అఖిల్ తిరుమలకు వెళ్ళాడు. 

కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నట్లు అఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 'నేను పునరుత్తేజాన్ని పొందడానికి సరైన ప్రదేశం తిరుమల. ఇక్కడకు వచ్చిన ప్రతి సారి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. గోవిందా.. గోవిందా' అని తన తిరుమల జర్నీ గురించి అఖిల్ వివరించాడు. 

ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా నివేతా పేతురాజ్ పేరు వినిపిస్తోంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ చిత్రాన్ని ఏ జోనర్ లో తెరకెక్కించబోతున్నాడో తెలియాల్సి ఉంది. ఈ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు.