మొత్తానికి అఖిల్ నాలుగవ సినిమా పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని అఖిల్ కసితో ఉన్నాడు. మూడు సినిమాలు చేసిన అఖిల్ ఇంతవరకు హిట్టందుకోలేదు. ఈ సమయంలో అఖిల్ ప్లాప్ దర్శకుడు భాస్కర్ తో కలవడం నిజంగా రిస్క్ అని చెప్పాలి. 

హిట్టు దర్శకులను నమ్మి ఇన్ని రోజులు ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఆరెంజ్ - ఒంగోలు గిత్త సినిమాల తరువాత కనిపించకుండా పోయినా భాస్కర్ ని నమ్మడం అనేది పెద్ద ప్రయోగమే. భాస్కర్ కి మంచి స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ ఉందని చెప్పవచ్చు. బొమ్మరిల్లు - పరుగు సినిమాలు అతని టాలెంట్ ఏంటో చూపిస్తాయి. 

భాస్కర్ స్క్రిప్ట్ ను నమ్మిన అఖిల్ ఈ నెల 24న సినిమాను లాంచ్ చేయడానికి సిద్దమయ్యాడు. రెగ్యులర్ షూటింగ్ ని జూన్ లో స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఇంకా అఖిల్ సరసన హీరోయిన్ సెట్టవ్వలేదు. కీర్తి సురేష్ ని ఇటీవల ఫైనల్ చేద్దామని అనుకున్నారట. అయితే ఆమె అఖిల్ కంటే పెద్దగా కనిపిస్తుందని వద్దనుకున్నారు. ఇక రశ్మిక మందన్న - కియారా అద్వానీ లాంటి బిజీగా ఉన్న హీరోయిన్స్ ని సెలెక్ట్ చేద్దామనుకుంటే వాళ్లు ఇప్పట్లో దొరికేలా లేరు. 

ఫైనల్ గా కొత్త హీరోయిన్ నే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ దొరికే వరకు మొదటి షెడ్యూల్ లో అఖిల్ కి సంబందించిన మెయిన్ సీన్స్ ను దర్శకుడు ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా అఖిల్ హీరోయిన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ 2 లో నిర్మించనున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు.