అక్కినేని యువ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇంతవరకు తనదైన ముద్ర వేయలేదు. డాన్సులు, పెర్ఫామెన్స్ పరంగా ఒకే అనిపించినా అభిమానులు కోరుకున్న విజయాన్ని అందించలేకపోయాడు. అఖిల్ నటించిన మూడు చిత్రాలు నిరాశపరిచాయి. తాజాగా అఖిల్ నాల్గవ చిత్రం ప్రారంభమైంది. శుక్రవారం రోజు అఖిల్ నాల్గవ చిత్రాన్ని లాంచ్ చేశారు. 

ముందుగా అనుకుంటున్నట్లుగానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ 4ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ బ్యాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బన్నీవాసు ఈ చిత్రానికి నిర్మాత. నిర్మాత బన్నీ వాసు అయినప్పటికీ గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి అల్లు అరవింద్ సూచనలు, సలహాలు తప్పకుండా ఉంటాయి. అల్లు అరవింద్ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

దీనితో అఖిల్ అల్లు అరవింద్ చేతుల్లో పడ్డాడు కాబట్టి ఈ సారి హిట్ ఖాయం అనే అంచనాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా అఖిల్ 4 లాంచింగ్ కార్యక్రమానికి నాగార్జున, అమల, అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. రాంచరణ్ తల్లి సురేఖ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. సురేఖ తన ఆశీస్సులని అఖిల్ కు అందించారు. 

సినిమా ప్రారంభోత్సవంలో అఖిల్ కొత్తగా కనిపించాడు. అఖిల్ ఈ చిత్రం కోసం కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పొడవైన హెయిర్ తో కనిపించాడు. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.