తమిళ స్టార్  హీరో అజిత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ చిత్రం `విశ్వాసం`. మొన్న సంక్రాంతికి త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ ఘన విజ‌యం సాధించింది. అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార  హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని స‌త్య‌జ్యోతి ఫిలింస్ అసోషియేష‌న్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్ ఫిలింస్ ప‌తాకంపై ఆర్‌.నాగేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

ఈ చిత్రంలో తెలుగు నటుడు జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. డబ్బింగ్ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి 1న విడుద‌ల చేయ‌టానికి రెడీ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ ట్రైలర్ లో అజిత్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు పాత్రల్లో అదరకొట్టారు. శివ గత సినిమాల్లోలాగానే ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. 2 నిమిషాల 13 సెకనుల నిధితో కూడిన ఈ ట్రైలర్‌లో అజిత్, జగపతిబాబుల యాక్షన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ‘‘జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడూ లేడు.. ఒకసారి నవ్వని పేదోడు లేడు’’ అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది.  

నయనతార, జగపతిబాబు, వివేక్‌, తంబి రామయ్య, యోగిబాబు, రోబో శంకర్‌, కోవైసరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌లు నిర్మిస్తున్నారు.