తమిళ హీరో అజిత్‌కి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `వాలిమై` చిత్ర షూటింగ్‌లో గాయపడ్డారు. బైక్‌తో రిస్కీ స్టంట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగింది. దీంతో అజిత్‌ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అజిత్‌కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని రోజులు అజిత్‌ షూటింగ్‌కి దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం అజిత్‌పై బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఎలాంటి డూప్‌ లేకుండా అజిత్‌ స్వయంగా బైక్‌ ఛేజ్‌ స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బైక్‌ స్కిడ్‌ అయి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అజిత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తుంది. బోనీ కపూర్‌ ఈ చిత్రాన్నినిర్మిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.