బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. అయితే ఈ సారి ఆయన బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ని డైరెక్ట్‌ చేయబోతుండటం విశేషం. ఇప్పటికే అజయ్‌ `యు మీ ఔర్‌ హమ్‌`, `శివాయ్‌` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మరోసారి తన దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టబోతున్నాడు. 

`మేడే` పేరుతో ఓ సినిమాని తెరకెక్కించేందుకు అజయ్‌ దేవగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రలో అమితాబ్‌ నటించనున్నాడట. ఇది హ్యూమన్‌ డ్రామాగా సాగుతుందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన చెబుతూ, `అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంలో అమితాబ్‌ నటిస్తున్నారు. ఇది ఉత్కంఠతో మునివేళ్లపై నిలబెట్టే హ్యూమన్‌ డ్రామా `మేడే`. ఇందులో అజయ్‌ పైలట్‌గా కనిపిస్తాడు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాని అజయ్‌ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది` అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే అజయ్‌, అమితాబ్‌ కలిసి ఇప్పటికే `మేజర్‌ సాబ్‌`, `ఖాకీ`, `సత్యాగ్రహ` వంటి సినిమాలు చేశారు. ఏడేళ్ళ గ్యాప్‌ తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ప్రస్తుతం అజయ్‌ `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తెలుగులో `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో మెరవబోతున్న విషయం తెలిసిందే. ఇక అమితాబ్‌ తెలుగులో ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో నటించనున్నారు. హిందీలో ప్రస్తుతం ఆయన `చెహర్‌`, `బ్రహ్మాస్త్ర`, `బటర్‌ఫ్లై`, `జుండ్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.