ఐశ్వర్య రాజేష్‌ నటించిన `ఫర్హానా` చిత్రం తమిళంతోపాటు హిందీ, తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోమవారం హైదరాబాద్‌కి వచ్చిన ఐశ్వర్య రాజేష్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ తెలుగులో ఓ మెరుపు మెరిసి మాయమైపోయింది. తెలుగులో ఆమె నాలుగైదు సినిమాలు చేసింది. నటిగా ఆకట్టుకుంది, కానీ ఒక్క హిట్‌ కూడా పడలేదు. మళ్లీ తమిళంకే పరిమితమైంది. తాను తెలుగు అమ్మాయినే అయినా పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే, దీంతో కోలీవుడ్‌తోనే తనకు ఎక్కువగా అనుబంధం ఉంది, అక్కడే తాను హీరోయిన్‌గా, నటిగా రాణించాను అని చెప్పింది. తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదు అనే ప్రశ్న చాలా సార్లు వినిపిస్తుందని, కానీ సరైన ఆఫర్లు రావడం లేదని తెలిపింది. కొన్ని ఆఫర్లు వచ్చాయి, కానీ నచ్చడం లేదని, తన పాత్రలు నచ్చకపోవడం వల్లే చేయడం లేదని చెప్పింది. తాను నటించిన `ఫర్హానా` చిత్రం తమిళంతోపాటు హిందీ, తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సోమవారం హైదరాబాద్‌కి వచ్చిన ఐశ్వర్య రాజేష్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

తాను సినిమా చేస్తే ఏదైనా స్పెషల్‌గా ఉండాలని, నాకు ముందు నచ్చాలని, రెగ్యూలర్‌ రోల్స్ తాను చేయనని, పాత్రకి ప్రయారిటీ లేకపోతే తాను నటించలేనని వెల్లడించింది. దాని కారణంగానే తెలుగులో సినిమాలు చేయలేకపోతున్నానని తెలిపింది. స్టార్‌ హీరోల సినిమా ఆఫర్లు రావడం లేదని వెల్లడించింది ఐశ్వర్య రాజేష్‌. పరోక్షంగా ఆమె టాలీవుడ్‌పై సెటైర్లు వేసింది. మరోవైపు వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయడంపై అడిగిన ప్రశ్నకి కాస్త వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యింది. మీడియా ప్రతినిధిపైనే సెటైర్లు వేసింది. ఇదే ప్రశ్న మీరు హీరోలని అడగగలరా, ఎందుకు సర్‌ మీరు కంటిన్యూగా హీరోగానే ఎందుకు చేస్తున్నారని అడగగలరా? అంటూ సెటైర్లు పేలుస్తూ యాటిట్యూడ్‌ చూపించింది ఐశ్వర్య రాజేష్‌.

దీనిపై ఐశ్వర్య రాజేష్‌ ఇంకా స్పందిస్తూ, తాను పర్టిక్యూలర్‌గా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే చేయాలని అనుకోలేదని, హీరోలతోనూ కలిసి సినిమాలు చేశాయని, అవి మున్ముందు రిలీజ్‌ అవుతాయని, అవి లేట్‌ కావడంతో అనుకోకుండా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలే వరుసగా విడుదలవుతున్నాయని, అందుకే అలాంటి ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది. నామీద న‌మ్మ‌కంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు `ఫ‌ర్హానా` సినిమాను నాతో చేయ‌టం చాలా ల‌క్కీగా భావిస్తున్నా. ఇది నాకు చాలా స్పెషల్‌ ఫిల్మ్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ మూడు భాష‌ల్లో రిలీజ్ కావ‌టం అనేది చాలా డిఫ‌రెంట్ అనే చెప్పాలి.

క్యారెక్ట‌ర్ ప‌రంగా `ఫ‌ర్హానా`లో నేను చాలా హెవీ రోల్ చేశాను. ప్ర‌తిరోజు షూటింగ్‌కు వెళ్లే స‌మ‌యంలో ఛాలెంజింగ్‌గా అనిపించేది. లైవ్ లొకేష‌న్స్‌లోనే షూటింగ్ చేశాం. డిఫ‌రెంట్ సినిమాల‌ను తెలుగు ఆడియెన్స్ ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో మేక‌ర్స్ ఈ సినిమాను మ‌న ముందుకు తీసుకొస్తున్నారు. మే 12న `ఫ‌ర్హానా` రిలీజ్ అవుతుంది` అని తెలిపింది ఐశ్వర్య. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య ముస్లీం అమ్మాయిగా, ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తుంది. కుటుంబ పోషణ కోసం ఆమె జాబ్‌ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురైన ఆటుపోట్ల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ ముస్లీం మహిళ పొందే స్వేచ్ఛ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది.