బాలీవుడ్ జనాలకు గత కొంత కాలంగా టాలీవుడ్ కథలు తెగ నచ్చేస్తున్నాయి. ప్రతి తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుక్కొని యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి అనంతరం ఆ డోస్ ఇంకాస్త పెరిగింది. నార్త్ జనాల మైండ్ సెట్ అర్ధం చేసుకుంటున్న కొందరు బాలీవుడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ కథల రైట్స్ ను భారీ ధరకు అందుకొని రీమేక్ చేస్తున్నారు. 

గత ఏడాది ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి రీమేక్ చేస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడంతో బాలీవుడ్ లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. నేడే సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. అయితే సినిమా కథలో చిత్ర యూనిట్ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చినట్లు సమాచారం. బాలీవుడ్ జనాల టెస్ట్ కి తగ్గట్టుగా రొమాన్స్ డోస్ ను కూడా పెంచుతున్నారట. ఇకపోతే ఆర్ఎక్స్ 100 సినిమాను ఇప్పటికే హిందీలో డబ్ చేశారు. యూ ట్యూబ్ లో చాలా మంది వీక్షించారు. ఆహాన్ రీమేక్ చేస్తున్నాడు అనగానే ఆ సంఖ్య ఇంకా ఎక్కువైంది. అందుకే ఒరిజినల్ కథను ఉన్నదీ ఉన్నట్టుగా కాకుండా డిఫరెంట్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.