ఏజెంట్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్ర ఫలితంపై నిర్మాత అనిల్ కుమార్ సుంకర మరోసారి స్పందించారు. అందరి తప్పు ఉందంటూ చెప్పుకొచ్చారు.
అక్కినేని హీరో అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ అంచనాలు అందుకోలేదు. తలా తోకా లేకుండా డబ్బులు ఖర్చు చేసి సినిమా తీశారనే వాదన వినిపించింది. అక్కినేని డై హార్డ్ ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. ఏజెంట్ డిజాస్టర్ కాగా... నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ కి వెళ్లి తప్పు చేశామని ఓపెన్ కామెంట్ చేశారు.
అది పరోక్షంగా దర్శకుడు సురేందర్ రెడ్డిని విమర్శించినట్లు అయ్యింది. చిత్ర ఫలితంపై అసహనంగా ఉన్న అనిల్ సుంకర దర్శకుడిని తప్పుబట్టారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్లకుండా తప్పు చేశామని అన్నాను, అంత మాత్రాన దర్శకుడు సురేందర్ రెడ్డినినిందించినట్లు కాదు. ఏజెంట్ విషయంలో అందరం తప్పు చేశాం. ఏ ఒక్కరినీ బ్లేమ్ చేయలేమన్నారు.
ఏజెంట్ ఫలితంతో నాకు జ్ఞానోదయమైంది. హీరో ఎవరైనా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాను, అన్నారు. సురేందర్ రెడ్డి, అఖిల్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఏజెంట్ విడుదల తర్వాత కూడా కలిసి మాట్లాడుకున్నాము. అఖిల్ కి మంచి హిట్ ఇవ్వాలి. అందుకు కథ కోసం చూస్తున్నాను, అని అనిల్ సుంకర అన్నారు. ఆయన నిర్మించిన సామజవరగమన సూపర్ హిట్ కొట్టింది. దాదాపు రూ. 19 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది.
సామజవరగమన ఏజెంట్ నష్టాలను కొంతలో కొంత పూడ్చిందని అనిల్ సుంకర అన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. సామజవరగమన టీమ్ తో మరొక సినిమా ఉంటుందన్నారు. హిడింబ విడుదలకు ముందే లాభాలు పంచినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక భోళా శంకర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చిరంజీవి-కీర్తి సురేష్ మధ్య సన్నివేశాలు కన్నీరు తెప్పిస్తాయన్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది.
