`ఏజెంట్` నష్టాల సెటిల్‌మెంట్ మ్యాటర్.. నిర్మాత చేతులెత్తేశాడు.. ఇక డైరెక్టర్ వంతు?
రిలీజ్‌కి ముందు భారీ హైప్ నెలకొన్న `ఏజెంట్` సినిమా విడుదలైన తొలి ఆట నుంచే నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజాగా నష్టాల సెటిల్మెంట్ విషయంలో అయోమయంలో ఉంది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన `ఏజెంట్` చిత్రం ఇటీవల(ఏప్రిల్ 28) విడుదలై ఘోర పరాజయం చెందింది. అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఇటీవల ఏ యంగ్ హీరోపై చేయని సాహసం అటు దర్శకుడు సురేందర్‌రెడ్డి, ఇటు నిర్మాత అనిల్ సుంకర చేశారు. స్పై నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రిలీజ్‌కి ముందు భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఘోర పరాజయాన్ని చవిచూసింది. సుమారు 80కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు పది కోట్లు కూడా రాలేదు. 14కోట్ల గ్రాస్, ఏడో కోట్ల నెట్ వచ్చింది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ సింగిల్‌గా తీసుకుంది. దాదాపుగా 25కోట్లకి థియేట్రికల్ రైట్స్ దక్కించుకుందని సమాచారం. అంతిమంగా ఇది సుమారు ఇరవై కోట్ల వరకు నష్టాలను చవిచూసింది. నాన్ థియేట్రికల్‌గా నిర్మాతకి మరో ఇరవై-ఇరవైఐదు కోట్ల వరకు వచ్చాయని సమాచారం. అయినా నిర్మాత 20-25కోట్ల నష్టాలను చవిచూశాడట. దీంతో తన సినిమా నష్టాలతో చేతులెత్తేసిన స్థితిలో ఉన్నాడు. అయితే భారీ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న గాయత్రి ఫిల్స్ ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో నష్టనివారణ చర్యలకుగానూ నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారట. కనీసం 15కోట్ల మేర అయినా సెటిల్డ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ తాను నిండా మునిగానని, తాను ఇవ్వలేనని నిర్మాత అనిల్ సుంకర చేతిలెత్తేసినట్టు సమాచారం.
దీంతో ఈ వ్యవహారం నిర్మాత నుంచి దర్శకుడి వైపు టర్న్ తీసుకుంది. దర్శకుడిపై గాయత్రి ఫిల్మ్స్ ప్రెజర్ తీసుకొస్తుందని, తమకి సెటిల్మెంట్ చేయాలని కోరుతున్నారట. అయితే ఈ సినిమాకి గానూ దర్శకుడికి అధికారికంగా 12కోట్ల పారితోషికం ఇవ్వాలనుకున్నారు. కానీ ఇచ్చింది ఆరు కోట్లే. మిగిలిన ఆరు కోట్లు సినిమా బడ్జెట్‌కి పెట్టాల్సి వచ్చింది. గతంలో నిర్మాత అనిల్ సుంకర కూడా ఇదే విషయం చెప్పారు. అందరు మొత్తం పారితోషికం తీసుకుంటే ఇది వంద కోట్ల సినిమా అని, ఈ లెక్కన దర్శకుడు సురేందర్‌రెడ్డి కేవలం 6 కోట్లే తీసుకున్నారట.
తన వద్దకు వచ్చిన గాయత్రి సంస్థ నుంచి సురేందర్‌రెడ్డి స్మార్ట్ గా తప్పించుకునే ప్లాన్ చేశారట. తనకు రావాల్సిన పారితోషికంలో ఆరు కోట్లే ఇచ్చారు. ఇంకా ఆరు కోట్లు రావాల్సి ఉంది. దాన్ని నిర్మాత నుంచి రికవరీ చేసుకోమని చెప్పారట. అలా ఈ సెటిల్మెంట్ వ్యవహారం నుంచి నెమ్మదిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారట. దీంతో ఇప్పుడు గాయత్రి ఫిల్మ్స్ ఏం చేయలేని, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని టాక్. నిజానికి ఈ సినిమా తెచ్చిన నష్టాలు అలాంటివి. కోట్లకు కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారితే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
అఖిల్ వంటి సక్సెస్ లేని, హీరోగా నిలబడని నటుడిపై ఇంత భారీ బడ్జెట్ పెట్టడమే పెద్ద మిస్టేక్. ఆయన సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆడలేదు. ఈ సినిమా నిండా ముప్పై కోట్లు చేసింది లేదు. పైగా ఆయనకు పెద్దగా మార్కెట్ లేదు. అలాంటి ఎనభై కోట్లు ఎలా పెడతారనేది పెద్ద ప్రశ్న. ఇదే ప్రశ్న నిర్మాతని ప్రశ్నించగా, కంటెంట్ ని నమ్మి పెట్టామని, ఇప్పుడు బాగున్న సినిమాలు అన్ని భాషల్లో ఆడుతున్నాయని, బడ్జెట్ సమస్యనే కాదన్నారు. కానీ అదే ఇప్పుడు బయ్యర్లకి, నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ పడింది. మరి ఈ నష్టాల నివారణ చర్యలు ఎంత వరకు సెటిల్ అవుతాయో చూడాలి.