బాహుబలి అనంతరం చాలా ఇండియన్ సినిమాలు చైనా లో రిలీజ్ అవుతున్నాయి. అక్కడ సక్సెస్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ఏ తెలుగు సినిమా చైనా మార్కెట్ టార్గెట్ పెట్టుకోలేదు కానీ ...బాలీవుడ్ మాత్రం ప్రతీ సారి అక్కడ తన ప్రతిభను పరిచయం చేయటానికి ఉత్సాహం పడుతుంది. పనిలో పనిగా పైసలు వెనకేసుకుంటోంది. చైనావాళ్లు సైతం మెల్లిమెల్లిగా మన సినిమాలకు, మన ముఖాలకు అలవాటు పడుతున్నారు. దాంతో అక్కడ వంద కోట్లు దాటుతున్నాయి.  అలాంటి మరో సినిమా రాణి ముఖర్జీ నటించిన  ‘హిచ్కీ’.


ఈ సంవత్సరం మార్చిలో  రిలీజైన ‘హిచ్కీ’ చిత్రం  విమర్శకుల ప్రశంసలు సాధించింది. ఇక్కడ మనదేశంలో  ఈ చిత్రం రూ. 76 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల ప్రక్కన నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 

చైనాలో ఈ నెల 12న విడుదలయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని,  100 కోట్ల మార్క్‌ను దాటేసినట్లు అఫీషియల్ బాలీవుడ్ ట్రేడ్  వార్త. ఈ విషయాన్ని  రాణి ముఖర్జీ  సైతం మీడియాకు తెలిపారు.  విషయం ఉన్న సినిమాకు భాషతో, ప్రాంతంతో సంబంధం లేదని ‘హిచ్కీ’ మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు.

 సిద్థార్థ్‌ మల్హోత్రా దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో రాణిముఖర్జీ టౌరెట్టీ సిండ్రోమ్ సమస్య ఉన్న టీచర్ పాత్రలో నటించింది. ఈ సమస్యతో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నపుడు మధ్య మధ్యలో చక్..చక్ అంటూ వింత శబ్దాలు చేస్తుంటారు.  రాణీ ముఖర్జీ నైనామాథుర్ అనే టీచర్ పాత్రలో కనిపిస్తుంది.   టీచర్‌ కావాలనే బలమైన లక్ష్యం...కానీ నోరు తెరచి ఏ మాట్లాడినా వింత శబ్దాలు చేసే జబ్బు... ఆ సమస్యను  దాటుకొని లక్ష్యం చేరుకునే మహిళ నైనా మాథుర్‌ పాత్రలో ఆకట్టుకున్నారు.
 

ఇంతకు ముందు ఛైనా భాక్స్ ఆఫీస్ వద్ద...అమిర్‌ ఖాన్‌ ‘ధూమ్‌3’, ‘దంగల్‌’, ‘పీకే’, ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్స్‌’, సల్మాన్‌ ఖాన్‌ ‘బజరంగి భాయిజాన్‌’ సినిమాలు విజయాన్ని సాధించాయి.