జాతీయ ఉత్తమనటిగా కీర్తి సురేష్ మహానటి చిత్రానికి అవార్డు కైవసం చేసుకుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాకు దక్కిన గౌరవం ఇది. ఉత్తమ నటి విభాగంలో మహానటి, ఇతర విభాగాల్లో రంగస్థలం, అ!, చిలసౌ చిత్రాలు జాతీయ అవార్డుల్లో సత్తా చాటాయి. తెలుగు సినిమా మరోస్థాయికి చేరిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఓ తెలుగు చిత్రానికి గాను జాతీయ ఉత్తమనటి అవార్డు రావడం గత 28 ఏళ్లలో ఇదే తొలిసారి. 28 ఏళ్ల క్రితం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 'కర్తవ్యం' చిత్రానికి గాను ఉత్తమనటిగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆ ఘనత కీర్తి సురేష్ కే దక్కింది. అంతకు ముందు తెలుగు సినిమాలో శారద,అర్చన లాంటి నటీమణులు ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. 

1967లో జాతీయ అవార్డులని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 41మంది నటీమణులు ఉత్తమ నటి విభాగంలో అవార్డు గెలుచుకున్నారు. షబానా అజ్మీ ఐదుసార్లు ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. సీనియర్ నటి శారద తొలిసారి తెలుగు సినిమాకు గాను ఉత్తమనటిగా అవార్డు అందుకున్నారు. 1978లో 'నిమజ్జనం' చిత్రానికి శారద ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. 

ఇక 1988లో అర్చన 'దాసి' చిత్రానికి ఉత్తమనటిగా ఎంపికయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకే ఉత్తమ నటి అవార్డు దక్కింది. 1990లో విజయశాంతి కర్తవ్యంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టేసింది. ఆ చిత్రానికి ఆమె ఉత్తమనటి అవార్డు గెలుచుకుంది. విజయశాంతి తర్వాత తెలుగు సినిమాకు ఉత్తమనటి విభాగంలో అవార్డు రావడానికి 28 ఏళ్ల సమయం పట్టింది. అదే ప్రస్తుతం కీర్తి సురేష్ ఉత్తమనటిగా ఎంపికైన మహానటి చిత్రం. 

మహానటి చిత్రం దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. సినీ రాజకీయ ప్రముఖులు కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.