టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అడివి శేష్. నటించడంతో పాటు తన సినిమాలకు స్క్రిప్ట్ లు కూడా రాసుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన 'ఎవరు' సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. తనను నమ్మి 'క్షణం' సినిమా తీసిన పీవీపీని అతడు ప్రశంసలతో ముంచెత్తాడు. ఒకప్పటి తన దీన స్థితిని గుర్తు చేసుకుని ఆ సమయంలో పీవీపీ అందించిన ప్రోత్సాహం గురించి చెప్పుకొచ్చాడు. తమది సంపన్న కుటుంబం కాకపోయినా.. సినిమాల మీద ప్యాషన్ తో 'కర్మ', 'కిస్' లాంటి సినిమాలను స్వీయ నిర్మాణంలో రూపొందించినట్లు శేష్ వెల్లడించాడు.

'కిస్' సినిమాకు రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టానని.. ఆ మొత్తం కూడా అప్పు చేసి పెట్టిందని చెప్పాడు. అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత డబ్బులు వెనక్కి రాలేదని..  జేబులో ఒక్క రూపాయి లేని స్థితి చేరుకున్నానని.. అప్పిచ్చిన వాళ్లు పోలీసులతో బెదిరించారని.. ఒకానొక సమయంలో ఢిల్లీలో పది మంది పోలీసుల మధ్య నిలబడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

అలాంటి సమయంలో పీవీపీ తనను నమ్మి ‘క్షణం’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని.. ఆ సినిమా హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని వెల్లడించాడు.