కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు పడ్డ నటుడు అడివి శేష్.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఈ క్రమంలో అతడికి మంచి గుర్తింపు లభించింది. అయితే 'క్షణం' సినిమాతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో నటించడంతో పాటు కథ కూడా రాయడం విశేషం.

ఇక 'గూఢచారి' చిత్రంతో అతడి రేంజ్ మారిపోయింది. ఈ సినిమాకి కూడా రైటింగ్ డిపార్టుమెంట్ లో పని చేశాడు శేష్. దీంతో ఇప్పుడు అతడి చిత్రాలకు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. కొద్దిరోజుల క్రితం ఈ నటుడు 'గూఢచారి-2', 'మేజర్' అనే సినిమాలు చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.

అయితే ఇప్పటికీ 'గూఢచారి 2' సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. 'మేజర్' కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. మరోపక్క 'టూ స్టేట్స్' రీమేక్ కూడా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాదిలో శేష్ నటించిన సినిమా విడుదల కాదనిఅనుకున్నారు. కానీ శేష్ సైలెంట్ గా ఓ థ్రిల్లర్ సినిమా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో శేష్ ట్విట్టర్ లో ఓ డిఫరెంట్ లుక్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి సీక్రెట్ మిషన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఆ సీక్రెట్ మిషనే ఓ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. సైలెంట్ గా ఈ సినిమాను పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. పీవీపీ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.