యంగ్‌ వర్సెటైల్‌ యాక్టర్‌, `క్షణం`, `గూఢచారి`, `ఎవరు` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల హీరో అడవి శేషు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న `మేజర్‌` చిత్ర ఫస్ట్‌ లుక్ ని విడుదల చేశారు. సాహసానికి మారుపేరు, ధైర్యవంతుడు, నిస్వార్థపరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా `మేజర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఉన్నికృష్ణన్‌గా అడవిశేషు నటిస్తున్నారు. `గూఢచారి` ఫేమ్‌ శశికిరణ్‌ తిక్కా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో అడవిశేష్‌ సీరియస్‌ లుక్‌లో, ఓ ఆపరేషన్‌ చేపడుతున్నట్టుగా ఉన్నాడు. చేతిలో గన్‌ ఉంది. తాజా లుక్‌ ఆకట్టుకుంటుంది. `26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. 

27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా  హీరో అడివి శేష్ ‌లుక్ టెస్ట్ పోస్ట‌ర్‌‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి‌ వెల్లడించిన వీడియోను రిలీజ్ చేసిన‌ విష‌యం తెలిసిందే. `మేజర్` టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయాల్లో షూటింగ్ తిరిగి ప్రారంభించి అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇప్పటి వరకు 70% షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ భాషలలో రూపొందిస్తున్నాం` అని చిత్ర బృందం తెలిపింది. 

ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల,  బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.