2016లో సంఘవి వివాహబంధంతో స్థిరపడింది. ఇటీవల వెండి తెరపై సంఘవి ఎక్కువగా కనిపించడం లేదు. సంఘవి తాజాగా ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొంది. ఆ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమెడియన్ అలీకి తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

ముఖ్యంగా సంఘవి బాలకృష్ణ గురించి చెప్పిన ఓ విషయం ఆసక్తిగా మారింది. మొదటగా తనకు బాలకృష్ణ తో నటించే అవకాశం సమరసింహారెడ్డి చిత్రంతో వచ్చిందని సంఘవి తెలిపింది. ఆ చిత్రంలో బాలయ్యతో కలసి నటించాలంటే నాకు భయం వేసింది. ఎందుకంటే బాలయ్యకు చాలా కోపం అని విన్నా. షూటింగ్ సమయంలో ఎలా రియాక్ట్ అవుతారనే టెన్షన్  నాలో ఉండేది. 

కానీ బాలకృష్ణగారే తన భయాన్ని పోగొట్టారని సంఘవి తెలిపింది. సెట్స్ లో నేనే ఒంటరిగా కూర్చుని ఉన్నా. ఎందుకు దూరం దూరంగా ఉంటున్నావు అని బాలయ్య అడిగారు. మీకు కోపం అని విన్నాను సర్.. అందుకే ఇలా అని చెప్పా. దానికి ఆయన నవ్వుతూ నాకు అసలు కోపమే రాదు అని అన్నారు. 

ఆయనే స్వయంగా వచ్చి ఆ మాట చెప్పడంతో నా భయం పోయింది. ఎలాంటి బెదురు లేకుండా సినిమాలో నటించా. ఆ తర్వాత గొప్పింటి అల్లుడు చిత్రంలో కూడా ఆయనతో కలసి నటించానని సంఘవి గుర్తుచేసుకుంది.