అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)లో వివాదం మొదలైంది. అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఎడెవల బాబు మరియు హీరోయిన్ పార్వతి తిరువొత్తు మధ్య గొడవ రాజేసుకుంది. పార్వతి తిరువొత్తు బాబుపై సీరియస్ అలిగేషన్స్ చేయడంతో పాటు అసోసియేషన్ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నటి భావన గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం అని తెలుస్తుంది. 

బాబు ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొనగా రిపోర్టర్ అసోసియేషన్ నిర్మించిన ట్వంటీ ట్వంటీ  మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న చిత్రంలో భావన మరలా నటిస్తున్నారా..? అని అడుగగా, దానికి సమాధానంగా బాబు... భావన ఇప్పుడు అసోసియేషన్ సభ్యురాలు కాదు, ఆమె రాజీనామా చేశారు. ఆమెకు బదులు అసోసియేషన్ సభ్యులలో ఒకరికి అవకాశం ఇస్తాం, అయినా చనిపోయిన వారిని తీసుకురాలేం కదా అన్నారు, ట్వంటీ ట్వంటీ మూవీలో భావన పాత్ర చనిపోతుంది, దానిని సెటైరికల్ గా బాబు చెప్పడం జరిగింది. 

ఈ విషయాన్ని పార్వతి తిరువొత్తు తీవ్రంగా తప్పుబట్టారు. తోటి లేడీ యాక్టర్ పట్ల ఆయన ప్రవర్తనా తీరు ఏమి బాగోలేదు అన్నారు. తాను రాజీనామా చేయడంతో పాటు, అమ్మ జనరల్ సెక్రటరీ పదవి నుండి బాబు తప్పుకోవాలని సభ్యులు అందరూ డిమాండ్ చేయాలని కోరడం జరిగింది. 2018లో నా ఫ్రెండ్ భావన అసోసియేషన్ కి రాజీనామా చేశారని, కనీసం తాను సభ్యురాలిగా కొనసాగడం ద్వారా గాడి తప్పిన అసోసియేషన్ ని దారిలో పెట్టాలనుకున్నాను అన్నారు. పరిస్థితులు చూస్తుంటే, బాగు చేయలేనంతగా వ్యవస్థ దెబ్బతిందని అర్థం అవుతుంది అన్నారు.  పార్వతి తిరువొత్తు బాబు పై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.