`గోల్ మాల్` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన నటి మీరా వాసుదేవ్ తన విడాకుల గురించి ఓపెన్ అయ్యారు. ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలను పంచుకున్నారు.
విడాకులపై స్పందించిన గోల్‌మాల్ హీరోయిన్
`గోల్‌మాల్` మూవీలో జేడీ చక్రవర్తితో కలిసి తెలుగు ఆడియెన్స్ ని ఊపేసింది నటి మీరా వాసుదేవన్. ఆ తర్వాత `అంజలి ఐ లవ్యూ` అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి మెప్పించింది. ఆ తర్వాత హిందీలోనూ మెరిసింది. అక్కడ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఆమె వార్తల్లో నిలిచింది. విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను విడాకులు తీసుకున్నానని, ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని చెప్పడం వెనుక కారణాన్ని మీరా వాసుదేవ్ వివరించారు. తన గురించి తప్పుడు ప్రచారాలు జరగకుండా ఉండేందుకే ఈ విషయాన్ని బయటపెట్టినట్లు ఆమె తెలిపారు.
ఇప్పుడు సింగిల్ గానే ఉన్నా - మీరా వాసుదేవన్
`నా గురించి తప్పుడు వార్తలు వ్యాపించకుండా, అపార్థాలు రాకుండా ఉండేందుకే నేను విడాకులు తీసుకున్నానని, సింగిల్‌గా ఉన్నానని చెప్పాను. నాపై వచ్చే నెగటివిటీ, వీడియోలు నన్ను పెద్దగా బాధించవు. ఇవన్నీ జరుగుతాయని నేను ముందే ఊహించాను. నా వైపు నుంచి తప్పులు జరిగాయి. నేను దాచడానికి ఏమీ లేదు. జీవితంలో ముందుకు వెళ్లాలి` అని మీరా స్పష్టం చేశారు.
కెరీర్ గురించి మీరా ఇంట్రెస్టింగ్ కామెంట్
`ప్రస్తుతం నా కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నాను. జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక అందమైన దశ. అనుభవాల నుంచే జీవితంలో స్పష్టత వస్తుంది. మనకు మనమే సౌకర్యంగా లేనప్పుడు, ఇతరుల నుంచి గుర్తింపు కోరుకుంటాం. అప్పుడు వాళ్లు చెప్పిందే మన నిజం అవుతుంది. అలా అని ఇతరులను బాధపెట్టకూడదు. కానీ, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ఎదగాలి` అని మీరా వాసుదేవ్ చెప్పుకొచ్చారు. 'మూవీ వరల్డ్ మీడియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా ఈ విషయాలు పంచుకున్నారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న మీరా వాసుదేవన్
మీరా వాసుదేవన్ 2005లో సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2010లో విడిపోయింది. రెండేళ్ల తర్వాత 2012లో ఆమె నటుడు జాన్ కొక్కెన్‌ని మ్యారేజ్ చేసుకుంది. నాలుగేళ్లకే ఆయన్నుంచి కూడా విడిపోయింది. మళ్లీ విపిన్ పుతియాంకన్‌ని 2024లో పెళ్లి చేసుకుంది. గతేడాది విడిపోయింది. చూడబోతుంటే మరో వనితా విజయ్ కుమార్‌లా ఉంది మీరా వాసుదేవన్.


