సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పేట' సినిమాతో కోలివుడ్ కి పరిచయమైన నటి మాళవిక మోహనన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వారికి ఘాటుగా బదులిచ్చింది ఈ బ్యూటీ.

వివరాల్లోకి వెళితే.. మాళవిక ఫోటో షూట్ లో భాగంగా దిగిన ఓ స్టిల్ ను సోమవారం నాడు షేర్ చేశారు. దానిలో ఆమె పొట్టి దుస్తుల్లో కనిపించారు. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. గౌరవనీయులైన అమ్మాయిలు ఇలాంటి బట్టలు ధరించకూడదని, కనీసం మీరైనా ఈ బట్టల్లో సౌకర్యంగా ఉన్నారా..? ఇది పద్ధతి కాదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

దీనిపై స్పందించిన మాళవిక.. ''ఓ గౌరవనీయమైన అమ్మాయి ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో చాలా కామెంట్లు వచ్చాయి. చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పారు. మీ అందరికీ సమాధానంగా ఎంతో గౌరవంగా,మర్యాదగా కూర్చుని ఉన్న మరో ఫొటో షేర్‌ చేస్తున్నా. నాకు ఎలాంటి దుస్తులు ధరించాలి అనిపిస్తే అలాంటివే వేసుకుంటా'' అంటూ ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి 'హీరో' అనే సినిమాలో నటిస్తోంది.