తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన జ్యోతి వ్యాంప్ తరహా పాత్రల్లో ఎక్కువగా కనిపించింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొని ఇంటి సభ్యురాలిగా మంచి మార్కులే తెచ్చుకుంది. కానీ ఎక్కువ రోజులు ఇంట్లో కొనసాగలేకపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చాటుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణతో ఆమె పడ్డ గొడవ గురించి గుర్తు చేసుకుంది. ''కితకితలు సినిమాలో వేషం ఉందని ఈవీవీ గారు పిలిస్తే వెళ్లాను. మంచి పాత్ర ఇస్తారని వెళ్తే నాకు వ్యాంప్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోల్ నేను ఒప్పుకున్నానని కొంతమంది రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నువ్వు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నావా..? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. 

దీంతో నాకు ఆ సినిమాలో నటించాలని అనిపించలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ గారికి చెబితే.. నేను అడిగితే చేయనంటావా అంటూ ఆయన కోప్పడ్డారు. నాకు బాధ అనిపించి వెంటనే షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయాను. అప్పటినుండి ఈవీవీ గారితో దూరం పెరిగింది. ఆయన సినిమాల్లో నటించలేదు'' అంటూ వెల్లడించింది.

ఇక జీవితంలో తాను ప్రేమించి మోసపోయానని శుభలేఖల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందని చెప్పింది. చిన్నవయసులోనే దుబాయికి చెందిన వ్యక్తితో వివాహం ఆ తరువాత విడాకులు జరిగిపోయానని తన కొడుకు తనతో ఉన్నందున సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.