కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. అంతా ఊహించినట్లుగానే నటి హేమని బయటకు పంపేశారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. 

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హేమ మీడియా సమావేశం నిర్వహించి పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. బిగ్ బాస్ 3లో తనకు అనుకూలంగా కొన్ని విషయాల జరగకపోవడం వల్లే తాను ఎలిమినేట్ కావలసి వచ్చిందని హేమ తెలిపింది. తనను అభిమానించే చాలా మందికి ఓటింగ్ పద్దతి తెలియక పోవడం వల్ల చాలా ఓట్లు కోల్పోయానని తెలిపింది. 

హౌస్ లో నేను ఎలాంటి తప్పులు చేయలేదు. మహేష్ విట్టా, వరుణ్ సందేశ్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. మహేష్ ని కొట్టడానికి కూడా వరుణ్ వచ్చాడు. ఆ గొడవని హైలైట్ చేయకుండా నేను వంటగదిలో అరిచిన మాటలని మాత్రం ఎక్కువగా చూపించారు. అక్కా అక్కా అంటూనే అందరూ తనని టార్గెట్ చేశారని హేమ తెలిపింది. 

ఇక బిగ్ బాస్ నిబంధనల గురించి కూడా హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు తనని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నట్లు హేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ నిబంధన నాకు తప్పుగా అనిపించలేదు. వాళ్ళ రూల్ ప్రకారం.. హౌస్ లో దాదాపు మూడు నెలలపాటు ఉండాలి ఎవరైనా గర్భంతో ఉండి.. హౌస్ లో ప్రమాదం జరిగితే స్టార్ మా యాజమాన్యం మీదికి వస్తుంది. కాబట్టే ఆ నిబంధన పెట్టారని హేమ తెలిపింది.