దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనను వేధిస్తున్నాడని సీనియర్ నటి అపూర్వ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మళ్లీ అతనే ఎమ్మెల్యేగా ఎన్నికైతే తమ ఆస్తులన్నీ అమ్ముకొని తెలంగాణా వెళ్లిపోతామని వెల్లడించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దెందులూరు చింతమనేని ప్రభాకర్ పై ఆరోపణలు చేసింది. తాను సినిమాలకు దూరం కావడానికి గల కారణాలు కూడా వెల్లడించింది. ''రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై నాకు అవగాహన ఉంది. దెందులూరులో మాది రాజకీయ నేపధ్యమున్న కుంటుంబం. మేము టీడీపీకి చెందినవాళ్లం.మాది కమ్మ కులమే కానీ నాకు కులగజ్జి లేదు.

కులం గురించి పెద్దగా పట్టించుకోను. కానీ టీడీపీకే ఓట్లు వేస్తున్నాం. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రార్ధించా.. మా నియోజకవర్గమైన దెందులూరులో చింతమనేని విజయం సాధిస్తే ఎంతో సంతోషించాను. కానీ మేం ఓట్లు వేసి గెలిపించి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మాకు నరకం చూపిస్తున్నాడు. ఆయన కారణంగా ఎన్నో కష్టాలు పడ్డాను. 

వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే గెలుపొందితే ఇక ఆస్తులు అమ్ముకొని తెలంగాణా వెళ్లిపోతాను. అక్కడ ప్రతి ఒక్కరికీ భద్రత ఉంది'' అని వెల్లడించింది. సినిమాలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు సమాధానంగా తన తల్లి గుండె జబ్బుతో బాధ పడుతుందని, ఆమెని చూసుకోవడం కోసం అవకాశాలు వస్తున్నా సినిమాలు చేయడం లేదని తెలిపారు.