మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో అంజలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నేడు ఆమె బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పూర్తి రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో ఓ సినిమా చేస్తున్నారు. `వీఎస్ 11` పేరుతో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి సర్‌ప్రైజ్ ఇచ్చింది యూనిట్. ఇందులో అంజలి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర గురించి అప్ డేట్ ఇచ్చింది. నేడు(జూన్ 16న) అంజలి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పాత్రని రివీల్ చేసింది. ఈ మేరకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
`వీఎస్11`లో అంజలి రత్నమాలగా కనిపించబోతున్నారట. తాజాగా విడుదల చేసిన ఆమె పాత్ర ఫస్ట్ లుక్‌లో అంజలి చీరకట్టి ఇల్లాలుగా ఉంది, జుట్టు ముడేసుకుంటూ ఆశ్చర్యం, కోపం మేలవింపుతో కూడిన ఎక్స్ ప్రెషన్స్ తో చూస్తుంది. ఆమె పాత ఇంట్లో ఉంది. గూట్లో దీపం వెలుగుతుంది. గొడకి పొరక ఉంది. చూస్తుంటే ఇది పీరియాడికల్ కథగా రూపొందుతుందని అర్థమవుతుంది. రత్నమాలగా అంజలి ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. పాత్రలో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. బలమైన పాత్రగా ఉంటుందనిపిస్తుంది.
అంజలి గురించి టీమ్ చెబుతూ, విలక్షణ నటి అంజలి పుట్టినరోజు(జూన్ 16) సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేశాం. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనున్నారు. అంజలి ఉత్తమమైన పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఆమెకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. రత్నమాలగా ఆమె మాస్ ప్రేక్షకులను అలరించనున్నారు` అని తెలిపింది. విశ్వక్ సేన్ పాత్ర, సినిమా వివరాలు వెల్లడిస్తూ, ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో విశ్వక్ సేన్ క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. క్రూరమైన వ్యక్తి కథను చూసేందుకు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామ`ని తెలిపింది యూనిట్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు గొప్ప అభిరుచితో మంచి కంటెంట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ జాబితాలో ఇది కూడా చేరుతుందని, మంచి ఆదరణ పొందుతుందన్నారు.
