హైదరాబాద్: ప్రముఖ రచయితగా పేర్గాంచిన తర్వాత గొల్లపూడి మారుతీరావు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1963లో డాక్టర్ చక్రవర్తి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు గొల్లపూడి మారుతీరావు.   

1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావు స్క్రీన్ ప్లే అందించిన ఆ చిత్రం విజయవంతం అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో ఆనాటి నుంచి వెనుతిరగలేదు. 

డాక్టర్ చక్రవర్తి సినిమాకు తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డును అందుకున్నారు. అనంతరం మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో గొల్లపూడి మారుతీరావు చేసిన నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం విజయం సాధించడంతో సినీ రంగంలో ఆయన వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. 

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో మెుదలైన ఆయన సినీ ప్రయాణం ఇప్పటి వరకు 250 చిత్రాల్లో నటించారు. సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో అందర్నీ అలరించారు. 

సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 వంటి చిత్రాలు ఆయన సినీచరిత్రలో మైలురాయిగా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత...