నటుడు సునీల్ డైరెక్టర్ గా మారి మెగాహీరో సాయి ధరం తేజ్ ని డైరెక్ట్ చేయాలని అనుకునేవాడట. ఈ విషయాన్ని సునీల్ స్వయంగా చెప్పడం విశేషం. సాయి అంటే తనకు చాలా ఇష్టమని.. తనకోసం దర్శకుడిగా మారి.. సినిమా చేయాలనిపించేది అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం సునీల్, సాయి ధరం తేజ్ కలిసి 'చిత్రలహరి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు హైదరాబాద్ లో సినిమా టీజర్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా సునీల్.. సాయి ధరం తేజ్ గురించి చెప్పడంతో పాటు తన చిన్నప్పటి చిత్రలహరి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. ''చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లకుండా సినిమాలు చూసేవాడిని.. రోజూ సాయంత్రం ట్యూషన్ మానేసి కూడా ఎగ్గొట్టేసి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. కానీ శుక్రవారం నాడు మాత్రం ట్యూషన్ కి వెళ్లేవాడిని. ఎందుకంటే ట్యూషన్ మాస్టర్ ఇంట్లో టీవీ ఉండేది. మంచం కింద దూరి చిత్రలహరి చూస్తుంటే.. మాస్టర్ నా  కాళ్లు పట్టుకొని లాగేసేవాళ్లు'' అంటూ అప్పటి రోజులు గుర్తుచేసుకున్నారు.