సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆసుపత్రిలో చేరి నెలరోజులు దాటిపోతుంది. గత నెల 5వ తేదీన ఆయన కరోనా సోకిందంటూ చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. ఆసుపత్రిలో చేరిన వారం రోజుల తరువాత ఆరోగ్యం విషమించడంతో ఐసీయూ కి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజు బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సమాచారం ఇస్తున్నారు. కొన్నాళ్ళు బాలు ఆరోగ్యం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చరణ్ కొద్దిరోజులుగా బాలు కోరుకుంటున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బాలు కోలుకుంటున్నారన్న వార్త దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను సంతోషానికి గురి చేస్తుంది. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ లెజెండ్స్ ఏ ఆర్ రెహమాన్, ఇళయరాజా ఆయన కోలుకోవాలని ఓ  ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాగా సినీ ప్రముఖులు బాలు ఆరోగ్యం గురించి ఎంతగా ఆవేదన చెందుతున్నారో నటుడు శుభలేఖ సుధాకర్ తెలియజేశారు. 

ముఖ్యంగా హీరో బాలయ్య ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి ప్రతిరోజు ఫోన్ చేసి వాకబు చేస్తారట. బాలుగారికి ఎలా ఉందని అడిగి తెలుసుకుంటారట. అలాగే మీరు దిగులు పడకండి ఆయన ఖచ్చితంగా కోలుకుంటారని ధైర్యం చెవుతారట. దైవభక్తి మెండుగా ఉన్న బాలయ్య ప్రతి రోజు రెండు మూడు గంటలు పూజ చేస్తారట. ఆ పూజలో బాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తనకు చెప్పినట్లు శుభలేఖ సుధాకర్ తెలియజేశారు. ఎస్పీ బాలు చెల్లెలైన శైలజను శుభలేఖ సుధాకర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.