మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడూ ఇలా జరగదు.. సిద్ధార్థ్ కి శివరాజ్ కుమార్ సారీ, పెరుగుతున్న మద్దతు
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా పరిష్కారం కావలసిన సమస్యతో సెలెబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా పరిష్కారం కావలసిన సమస్యతో సెలెబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. తమిళనాడుకు కావేరి జలాలని విడుదల చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ నిరసన సెగ హీరో సిద్దార్థ్ ని కూడా తాకింది. సిద్దార్థ్ నటించిన చిన్నా చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బెంగుళూరులో ప్రమోషన్స్ నిర్వహించారు. సిద్ధార్థ్ పాల్గొనే ఈ మీడియా సమావేశాన్ని నిరసన కారులు అడ్డుకున్నారు. సిద్దార్థ్ మీడియా సమావేశంలో కూర్చుని ఉండగా నిరసన కారులు అడ్డుకుని సిద్దార్థ్ ని మీడియా సమావేశం నుంచి పంపించేశారు. దీనితో సిద్దార్థ్ మీడియాకు థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే క్రమంగా సినీ ప్రముఖుల నుంచి సిద్దార్థ్ కి మద్దతు లభిస్తోంది. ఈ ఘటనపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆల్రెడీ క్షమాపణ కోరారు. తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స్పందించారు. సిద్దార్థ్ కి జరిగిన సంఘటన చాలా బాధాకరం. మా ఇండస్ట్రీ తరుపున సిద్దార్థ్ కి క్షమాపణలు కోరుతున్నా. సిద్దార్థ్ మమ్మల్ని క్షమించండి. ఈ సంఘటన మమ్మల్ని కూడా బాధపెట్టింది. ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాం అని శివరాజ్ కుమార్ తెలిపారు.
ఈ సంఘటనపై ప్రకాష్ రాజ్ కూడా ఆసక్తికర వ్యాఖలు చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యని పరిష్కరించడంలో రాజకీయ నాయకులు, పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయి. వాళ్లపై ఒత్తిడి తీసుకురాకుండా కళాకారులని, సామాన్యులని ఇద్దండి పెట్టడం ఏంటి అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. సిద్దార్థ్ కి క్షమాపణ తెలిపారు.