సినిమా పరిశ్రమలో పని చేసి అవకాశాలు లేక వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం కనీస ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. నటుడు సావి సిద్ధు పరిస్థితి కూడా ఇలానే మారింది.

వివరాల్లోకి వెళితే.. 'బ్లాక్ ఫ్రైడే', 'పాటియాలా హౌస్' వంటి చిత్రాల్లో నటించిన సావి సిద్ధు ప్రస్తుతం అవకాశాలు లేక సెక్యురిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా  ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సావి సిద్ధు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబుతూ.. ''12 గంటల ఈ ఉద్యోగం చాలా కష్టమైంది. మెకానికల్ జాబ్. బస్ టికెట్ కొనడానికి కూడా డబ్బు లేదు. ఇక సినిమా టికెట్ కొనడమనేది ఓ కలగా మారింది. ప్రస్తుతం నా ఆర్ధిక పరిస్థితి ఏం బాగాలేదు'' అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన కొందరు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 

సావి ఎన్నుకున్న మార్గం ఎందరికో ఆదర్శం అంటూ నటుడు రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. తన పరిచయస్తులకు చెప్పి సావికి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు. సావి గౌరవప్రదమైన జీవితాన్ని ఎన్నుకున్నారని, డబ్బిచ్చి ఆయన స్వాభిమానాన్ని దెబ్బతీయకూడదని అనురాగ్ కశ్యప్ అన్నారు.